Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ అనేది కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడంతో వచ్చే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇటీవల కాలంలో ఇది చాలామందిలో.. ముఖ్యంగా స్త్రీలలో పెరుగుతోంది. ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌కు సంబంధించిన ముఖ్య లక్షణాలు, వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ లక్షణాలు:
ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు చూపించదు. సమస్య తీవ్రమయ్యే కొద్దీ ఈ లక్షణాలు బయటపడతాయి.
అలసట, బలహీనత: ఇది ఒక ప్రధాన లక్షణం. కొవ్వు కాలేయం ఉన్నవారు తరచుగా నీరసంగా, బలహీనంగా ఉన్నట్లు భావిస్తారు. సాధారణ పనులు చేసినా త్వరగా అలసిపోతారు.
పొత్తికడుపులో అసౌకర్యం: కుడి వైపున, పొత్తికడుపు పై భాగంలో తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యలో ఈ లక్షణం కనిపిస్తుంది.
బరువు తగ్గడం: కొందరిలో ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గుతారు. ఇది శరీరంలో సరైన పోషకాలు గ్రహించబడకపోవడానికి సంకేతం కావచ్చు.
వాపు: కొన్నిసార్లు కాళ్లు, పాదాలు, పొత్తికడుపులో వాపు రావచ్చు. ఈ వాపును ఈడిమా అని కూడా అంటారు.
చర్మం, కళ్లలో మార్పులు: కొవ్వు కాలేయం తీవ్రమైనప్పుడు, కామెర్లు రావచ్చు. దీనివల్ల కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
వికారం, వాంతులు: తరచుగా వికారం వచ్చినట్లు అనిపించడం, వాంతులు కావడం కొవ్వు కాలేయం వల్ల సంభవించవచ్చు.
మానసిక సమస్యలు: నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, గందరగోళంగా ఉండటం వంటివి కూడా కొన్నిసార్లు కొవ్వు కాలేయం లక్షణాలు కావచ్చు.
స్త్రీలలో ప్రత్యేక లక్షణాలు:
పీరియడ్స్ లో మార్పులు: ఫ్యాటీ లివర్ హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల పీరియడ్స్ క్రమం తప్పడం లేదా అధికంగా రక్తస్రావం కావడం జరగవచ్చు.
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS):ఫ్యాటీ లివర్ PCOS మధ్య సంబంధం ఉంది. PCOS ఉన్న స్త్రీలలో ఫ్యాటీ లివర్‌కు వచ్చే ప్రమాదం ఎక్కువ.
హార్మోనల్ మార్పులు: మెనోపాజ్ తర్వాత స్త్రీలలో ఫ్యాటీ లివర్‌కు ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్లలో వచ్చే మార్పులు దీనికి ఒక కారణం.
Also Read: మానసిక ఆరోగ్యం కోసం ఏం తినాలి ?
ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి ?
పైన పేర్కొన్న లక్షణాలు మీకు తరచుగా కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా సమస్యను నిర్ధారిస్తారు. ఫ్యాటీ లివర్ సమస్యలకు చికిత్స చేయవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే, అది సిర్రోసిస్, లివర్ ఫేల్యూర్‌కు దారితీస్తుంది.
నివారణ చర్యలు:
ఆరోగ్యకరమైన ఆహారం: కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి.
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది.
మద్యపానం మానుకోండి: ఆల్కహాల్ కాలేయానికి చాలా హానికరం. దానిని పూర్తిగా మానుకోవడం మంచిది.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా స్త్రీలు తమ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.