Fake Paneer: పనీర్ అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో లభించే పనీర్ అంతా స్వచ్ఛమైనది కాకపోవచ్చు. అయితే ఇలాంటి కల్తీ పనీర్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. మీరు కొనే పనీర్ అసలైనదా, కాదా అని ఇంట్లోనే సులభంగా తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నాణ్యతను రుచి, వాసనతో గుర్తించడం:
అసలైన పనీర్‌కు సహజమైన పాల వాసన ఉంటుంది. దీనిని కొంచెం నమిలితే.. నోట్లో పాల రుచి, కొద్దిగా తీపిదనం అనిపిస్తుంది. అదే కల్తీ పనీర్ అయితే, వాసన పలచగా ఉంటుంది లేదా రబ్బర్ మాదిరిగా అనిపిస్తుంది. రుచిలో కూడా కృత్రిమంగా లేదా పుల్లగా కూడా అనిపించవచ్చు. కల్తీ పనీర్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వెంటనే పాడవుతుంది.
2. రంగు, ఆకృతి (టెక్చర్) ద్వారా గుర్తించడం:
స్వచ్ఛమైన పనీర్ మెత్తగా.. కొంచెం పసుపు రంగులో ఉంటుంది. నొక్కితే సులభంగా విరిగిపోతుంది. అదే కల్తీ పనీర్ అయితే, అది తెల్లగా, గట్టిగా ఉంటుంది. దానిని నొక్కితే రబ్బర్ మాదిరిగా గట్టిగా అనిపిస్తుంది. కల్తీ పనీర్‌ను వేడి చేస్తే అది చాలా సాగిపోతుంది. పనీర్ మాదిరిగా విరిగిపోదు.
3. టింక్చర్ అయోడిన్ పరీక్ష:
ఈ పరీక్ష చాలా సులభం. ఒక చిన్న ముక్క పనీర్‌ను తీసుకొని, దానిపై ఒక చుక్క టింక్చర్ అయోడిన్‌ను వేయండి. ఇది సాధారణంగా మెడికల్ షాపుల్లో లభిస్తుంది. దీని ద్వారా ఈజీగా కల్తీ పన్నీర్‌ను గుర్తించవచ్చు.
ఫలితం: పనీర్ ముక్క రంగు నీలం రంగులోకి మారితే.. ఆ పనీర్‌లో పిండి పదార్థాలు (స్టార్చ్) కలిపారని అర్థం. ఇది కల్తీ పనీర్ అని నిర్ధారించవచ్చు. స్వచ్ఛమైన పనీర్ అయితే.. రంగులో ఎలాంటి మార్పు ఉండదు.
4. వేడి నీటి పరీక్ష:
పనీర్ కల్తీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇది మరొక సులభమైన పద్ధతి. ఒక గిన్నెలో నీటిని మరగబెట్టి.. అందులో కొద్దిగా పనీర్ ముక్కలను వేయండి. ఐదు నిమిషాల తర్వాత ఆ ముక్కలను తీసివేయండి.
ఫలితం: నీరు చల్లబడిన తర్వాత.. దానిలో పనీర్ ముక్కలు గట్టిపడి, రబ్బర్ మాదిరిగా ఉంటే అది కల్తీ పనీర్ అని నిర్ధారించవచ్చు. స్వచ్ఛమైన పనీర్ అయితే.. అది మెత్తగా ఉంటుంది.
Also Read: కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?
5. చేతితో నొక్కి చూడటం:
పనీర్ కొనేటప్పుడు.. చేతితో నొక్కి చూడండి. స్వచ్ఛమైన పనీర్ మెత్తగా.. కొద్దిగా నీరు వదులుతుంది. కల్తీ పనీర్ చాలా గట్టిగా, పొడిగా ఉంటుంది. నొక్కితే వెంటనే విరిగిపోదు.
ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు కల్తీ పనీర్‌ను గుర్తించి, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పనీర్‌ను ఎంచుకోవచ్చు. అంతే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.