Kharge Slams Modi| పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి జరగబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముందే తెలుసునని సంచలన ఆరోపణలు చేశారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ‘సంవిధాన్ బచావో’ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మూడు రోజుల ముందే నిఘా విభాగాల ద్వారా సమాచారం అందిందని ఖర్గే ఆరోపించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పారు. అయితే, అదే సమయంలో పర్యాటకులకు భద్రత కల్పించడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు.
పర్యాటక ప్రాంతంలో పోలీసుల చేత, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేత భద్రత కల్పించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని ఖర్గే అన్నారు. ఈ కచ్చితంగా భద్రతా బలగాల, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పహల్గాం బాధతులకు న్యాయం చేయడమే ప్రధానమని.. అందుకోసం ఈ విషయంపై కాంగ్రెస్ రాజకీయాలు చేయదల్చుకోలేదని అన్నారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే కాంగ్రెస్ తప్ప సమర్థిస్తుందని అన్నారు.
Also Read: పడకగదిలో భార్యతో కృూరంగా ప్రవర్తించిన బాడీ బిల్డర్.. యువతి మృతి
మరోవైపు ఖర్గే చేసిన ఈ ఆరోపణలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేయబడ్డవని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా విమర్శించారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు.
ఇక బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండి కూడా ఖర్గే వ్యాఖ్యలపై స్పందించారు. భారత్, పాకిస్తాన్ మధ్య గల ఉద్రిక్తతల నడుమ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికి తాము పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్న సమయంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జరిపే రాజకీయ దాడిగా ఆయన అభివర్ణించారు.
ఇదే విషయాన్ని మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌పై పోరులో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు ఖర్గే చేసిన వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైనదిగా, దురదృష్టకరమైనదిగా పేర్కొన్నారు.
ఈ వివాదం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.