కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ఆధ్వర్యం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 8వ వేతన సంఘం చైర్మెన్ ను నియమించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. తాజా కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మీడియాకు వివరించారు.
భారీగా జీతాలు పెరిగే అవకాశం!
ఇక 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. తాజా పే కమిషన్ ప్రకారం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.86 శాతంగా నిర్ణయించబడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే బేసిక్ సాలరీ రూ.51,480కి చేరే అవకాశం ఉంటుంది. కనీస మూల వేతనం రూ.18000గా ఉండనుంది. దీనితో పాటు, పెన్షనర్లు కూడా ఇదే రకమైన బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ.9000 నుండి రూ.25,740కి పెరిగే అవకాశం ఉంటుంది.
2016లో అమల్లోకి 7వ వేతన సంఘం
2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అప్పట్లో పే బ్యాండ్స్, గ్రేడ్ పే స్థానంలో సింప్లిఫైడ్ పే మ్యాట్రిక్ అమలులోకి తీసుకొచ్చారు. కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించారు. కేబినెట్ సెక్రటరీ స్థాయికి అధికారికి ఎక్కువలో ఎక్కువగా రూ. 2.50 లక్షల వేతనం నిర్ణయించారు. బేసిక్ పే మీద 2.57 రెట్లు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఇస్తున్నారు. గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు రీసెంట్ గానే పెంచారు. ద్రవ్యోల్బణం ఇండెక్స్ ఆధారంగా డీఏ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది.
PM @narendramodi Ji has approved the 8th Central Pay Commission for all Central Government employees. pic.twitter.com/4jl9Q5gFka
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 16, 2025
రూ.3,985 కోట్ల వ్యయంతో ఇస్రో లాంచ్ ప్యాడ్ నిర్మాణం
అటు శాస్త్రసాంకేతిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్ర శ్రీహరికోటలో సరికొత్త లాంఛ్ ప్యాడ్ కు ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధనలకు మరింత ఊతం అందించేలా లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ను నిర్మించనున్నారు. GSLV ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్నున్నట్లు తెలుస్తున్నది. GSLV ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు అనుగుణంగా ఈ లాంఛ్ ప్యాడ్ ను నిర్మింనున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో దీని నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు.కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం భారత అంతరిక్ష పరిశోధనను మరింత బలోపేతం చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Read Also: భారత అమ్ములపొదిలో 3 నౌకాస్త్రాలు.. జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి