Heavy rains: తెలంగాణ వ్యాప్తంగా జోరందుకున్న వర్షాలు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టులకు నిండుకుండలా మారాయి. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు తెలంగాణ మొత్తానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మూడు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ రోజు, రేపు తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. తెలంగాణలో ఇవాళ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు భాగ్యనగరానికి వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
ALSO READ: AP News: ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులు? డైలీ ఆ దేశానికి కాల్స్.. NIA కస్టడీలోకి ఇద్దరు తీవ్రవాదులు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..
కాగా నిన్నటి నుంచి సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్షం అల్లకల్లోలం సృష్టించింది. జిల్లాల్లో వాగు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 14.7 సెంటీ మీటర్ల వర్షం పడగా..మెదక్ జిల్లా శివ్వంపేట లో 12.8 సెంటి మీటర్ల వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా మీన్ పూర్ కోమటికుంటకు గండి పడింది. చాలా వరకు పంట పొలాలు నీటమునిగాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట శివారులో మోత్కుల కుంటకు గండి పడడంతో నీరు వృథాగా పోతుంది. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
ALSO READ: LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం
ఆ ఒక్క రోజు జాగ్రత్త..
మంజీరా నద ఉధృతికి ఏడుపాయల వనదుర్గ ఆలయం మూతపడింది. ప్రమాదకర స్థాయిలో ఆలయం ఎదుట మంజీరా నది ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో ఈ నెల 17వ తేదీన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.