New Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే నడుస్తున్న వందేభారత్ రైళ్లకు తోడుగా ఇంకో రైలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ రైలు విజయవాడ నుంచి బెంగళూరు మధ్య తన సర్వీసులను అందించనుంది. ఈ రైలు తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళ్లే రూట్ ఖరారు చేశారు. ఈ రైలుకు కొద్ది కాలం క్రితమే ఆమోదం దక్కింది. ఇప్పుడు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ రైలు ద్వారా కేవలం 9 గంటల్లో విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ చేశారు.
మూడు గంటల ప్రయాణ సమయం ఆదా
ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకి వందేభారత్ రైలు నడుస్తున్నది. బెంగళూరుకు కేటాయించాలని ప్రజా ప్రతినిధులతో పాటు ప్రయాణీకుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వందేభారత్ రైలుకు సంబంధించి మేలో నిర్ణయం తీసుకున్నారు. కాగా కోచ్ ల సమస్య కారణంగా రైలు ఆలస్యం అయ్యింది. ఇప్పుడు సరిపడ కోచ్ లు అందుబాటులోకి రావడంతో రైలు ఆపరేషన్స్ ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం విజయవాడ- బెంగళూరు మధ్య ఉన్న అన్ని రైళ్లతో పోల్చితే మూడు గంటల ప్రయాణ సమయాం ఆదా అవుతుంది. ఈ వందేభారత్ రైలు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతికి వెళ్లే భక్తులకు కూడా చాలా ఉపయోగపడనుంది.
Read Also: హైదరాబాద్ మీదుగా మరో వందే భారత్ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
8 బోగీలతో అందుబాటులోకి కొత్త వందేభారత్!
విజయవాడ- బెంగళూరు వందేభారత్ రైలు 8 కోచ్ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో 7 AC చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలుకు నెంబర్ తో పాటుగా రూట్., షెడ్యూల్ త్వరలో ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ రైలు(20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయల్దేరుతుంది. తెనాలికి 5.39, ఒంగోలుకు 6.28, నెల్లూరుకు 7.43, తిరుపతికి 9.45, చిత్తూరుకు 10.27, కాట్పాడికి 11.13, కృష్ణరాజపురానికి 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది. అటు తిరుగు ప్రయాణం ఇదే రైలు (20712) అదే రోజు బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు బయల్దేరుతుంది. కృష్ణరాజపురానికి 14.58, కాట్పాడికి 17.23, చిత్తూరుకు 17.49, తిరుపతికి 18.55, నెల్లూరుకు 20.18, ఒంగోలుకు 21.29, తెనాలికి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల తిరుపతి, బెంగళూరుకు వెళ్లే ప్రయాణీకులకు మరింత లాభం కలగనుంది. ఈ రైల్వే సేవలు రెండు నగరాల మధ్య వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందజేయనుంది.
Read Also: హైదరాబాద్ నుంచి నేరుగా హిల్ స్టేషన్స్ కు తీసుకెళ్లే రైళ్లు ఇవే.. ఘాట్ రోడ్డులో వెళ్లక్కర్లేదు!