తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఎక్కువ మంది రైలు ద్వారానే తిరుపతికి చేరుకుంటారు. నిత్యం దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), భారతీయ రైల్వే మధ్య సమన్వయ లోపం ఇప్పుడు భక్తులకు ఇబ్బందులను కలిగిస్తోంది. ఇంతకీ అసలు సమస్య ఏంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రతి నెల 3వ వారంలో దర్శనం టికెట్ల కోటా విడుదల
టీటీడీ ప్రతి నెల మూడవ వారంలో దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తుంది. సుమారు పదివేల టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడవుతాయి. తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైల్వే కనెక్టివిటీ ఉండటంతో చాలా మంది రైళ్ల ద్వారా వస్తారు. దర్శన టికెట్లను బుక్ చేసుకునే వారిలో దాదాపు 60 శాతం మంది రైల్వే వెబ్ సైట్ ద్వారా అదే సమయంలో టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇటీవల భారతీయ రైల్వే ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఈ నేపథ్యంలో టీటీడీ టికెట్ల విడుదల షెడ్యూల్, రైల్వే బుకింగ్ లభ్యత మధ్య పొంతనకుదరడం లేదు. భక్తులు తమ దర్శన తేదీలతో రైలు టికెట్లను పొందడం కష్టతరం అవుతోంది.
సమస్య పరిష్కారం ఎలా?
టీటీడీ కోటా టికెట్ల విడుదల తేదీని మూడవ వారం నుంచి ప్రతి నెల చివరి రోజుకు మార్చినట్లయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భక్తులుభావిస్తున్నారు. దీని వలన టీటీడీ దర్శన టిక్కెట్ల బుకింగ్‌లు భారతీయ రైల్వే, 60-రోజుల రిజర్వేషన్ విండోకు అనుగుణంగా ఉంటాయి. భక్తులు తమ ప్రయాణాన్ని, తీర్థయాత్రను కలిసి ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుందంటున్నారు.
Read Also: రైలుకు బర్త్ డే.. కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసిన ప్రయాణీకులు!
రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
మరోవైపు రైల్వే అధికారులు తిరుపతికి ప్రత్యేక రైళ్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భక్తుల పెరుగుదలకు అనుగుణంగా సుదూర రైళ్లకు అదనపు కోచ్‌లను జోడిస్తున్నారు. వెయిట్‌లిస్ట్‌ను పర్యవేక్షించడం ద్వారా, అందుబాటులో ఉన్న అదనపు రేక్‌లను ఉపయోగించి వివిధ ప్రదేశాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తామని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పల సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఏర్పాట్లు సీనియర్ అధికారులతో సమన్వయంతో కొనసాగుతాయన్నారు. ప్రయాణీకులు ఇబ్బంది లేకుండా ప్రయాణాలు కొనసాగించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీ కోటా దర్శనం టికెట్ల విడుదలను నెలాఖరుకు మార్చాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల రైలు ప్రయాణంపై ఆధారపడే యాత్రికులకు మరింత లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంలో టీటీడీ అధికారులు సమాచాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. నెలాఖరుకు టికెట్లను విడుదల చేస్తే, రైల్వే ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఇబ్బంది లేని ప్రయాణ అవకాశం ఉందంటున్నారు.
Read Also: కాశ్మీర్ వందేభారత్ కు ముహూర్తం ఫిక్స్, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ఎప్పుడంటే?