27 Years Without Dayoff| ప్రపంచంలో ఒక వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించే వారెవరు? అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే. తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్తు కోసం.. వారి అభివృద్ది కోసం.. వారికి మెరుగైన జీవితం అందించాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ఎంతటి కష్టం వచ్చినా సహిస్తారు.. కానీ తమ సంతానం ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి త్యాగ మూర్తలలో ఒకరు అబు బకర్. ఈయన కటిక పేదరికంతో పోరాడుతూ.. కుటుంబాన్ని పోషించడానికి 27 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశాడు. అది కూడా ఎవరూ చేయడానికి ఇష్టపడని పని. అయితే ఆయన కష్టం వృథా కాలేదు. పిల్లలు ప్రయోజకవంతులయ్యారు.
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ కు చెందిన అబుబకర్ కుటుంబంలో భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన 1996లో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ఒక స్నేహితుడి సాయంతో మలేషియాలో ఉద్యోగం కోసం 1997లో వెళ్లాడు. ఆయన వెళ్లే సమయానికి ఆయన చిన్న కుమారుడి వయసు 6 నెలలు మాత్రమే.
అయితే మలేషియా వెళ్లాక అబుబకర్ కు ఉద్యోగం దొరకలేదు. దీంతో నిరాశలో కూరుకుపోయిన అబుబకర్ అక్కడ ఒక చిన్న ఉద్యోగం ఉందని తెలిసింది. ఒకవైపు ఇంట్లో పిల్లలకు తినడానికి తిండి కూడా లేదు. దీంతో అబుబకర్ ఏ ఉద్యోగం అయినా చేసేందుకు సిద్ధమని ముందుకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. అది పారిశుధ్య కార్మికుడి ఉద్యోగం. ఆ ఉద్యోగం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అయినా అబుబకర్ తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాడు. ఆ ఉద్యోగం చేసేందుకు ఒప్పుకున్నాడు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..
అలా 1997లో ప్రారంభమైన పారిశుధ్య కార్మికుడి ఉద్యోగంలో అబుబకర్ గత 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆయన గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో అబు బకర్ జీవితం గురించి రాశాడు. 70 ఏళ్ల అబు బకర్ దినచర్య గురించి చెబుతూ.. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం చేశాక టిఫిన్ చేసి పనికి వెళ్తానని అన్నారు. సాయంత్రం పని పూర్తయ్యాక ఇంటికి చేరుకొని నిత్యం తన భార్య, పిల్లలతో ఫోన్ లో మాట్లాడుతానని తెలిపారు. భార్య, పిల్లలతో కలిసి ఉండలేకపోతున్నందుకు తాను ఎంతో బాధపడతానని చెప్పారు.
తాను గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికి తిరిగి వెళ్లాలని ఎంత ప్రయత్నించినా పిల్లల చదువులకు, ఇంట్లో అత్యవసర ఖర్చులకు డబ్బు అవసరమయ్యేదని.. ఈ కారణంగా తన తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చానని తెలిపారు. పైగా సెలవు తీసుకోకుండా పనిచేస్తే.. అదనంగా ఓవర్ టైమ్ సంపాదన వస్తుందని.. దాంతో పిల్లల కాలేజీ ఫిజులు చెల్లించవచ్చని చెప్పాడు.
అబుబకర్ గత 27 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉన్నారు. ఆయన కథని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూజర్ పారిశుధ్య కార్మికులను హీన భావనతో చూడడం తప్పు.. అని వారిని తమ స్నేహితులుగా భావించాలని మలేషియా ప్రజలను కోరారు.
అబుబకర్ కథ చివరగా సంతోషకరంగా ముగిసింది. ఆయన ఇటీవలే బంగ్లాదేశ్ లోని తన ఇంటికి తిరిగివచ్చారు. అబుబకర్ ఇన్నాళ్లు పడ్డ కష్టం ఫలించింది. ఆయన కూతురు ఒక న్యాయమూర్తి. ఆయన ఇద్దరు కొడుకులలో ఒకరు డాక్టర్, మరొకరు ఇంజినీర్. తన పిల్లలు ప్రయోజకలు అయినందుకు చాలా సంతోషంగా ఉందని.. తనకు ఇంతకంటే జీవితంలో ఏమీ అవసరం లేదని అబుబకర్ అన్నారు.