Government School: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝాలావాడ్ జిల్లాలోని పిప్లోడ్ ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 28 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం 7:45 గంటల సమయంలో పిల్లలు ప్రార్థనకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆరు, ఏడు తరగతుల గదులపై ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ తరగతి గదుల్లో మొత్తం 35 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, స్థానికుల సాయంతో విద్యార్థులను బయటకు తీశారు. ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు స్పాట్ లో మృతిచెందినట్టు తెలుస్తోంది. మరో తొమ్మిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారిలో ఆరేళ్ల చిన్నారి కన్హా (11), అతని సోదరి మీనా (12)తో సహా పాయల్ (12), హరీష్ (8), ప్రియాంక (12), కుందన్ (12), కార్తిక్ (12) ఉన్నారు. పిల్లలు మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. తన ఇద్దరు పిల్లలను కోల్పోవడంతో ఓ తల్లి మనోవేదనకు గురైంది. ‘నా ఇల్లు ఖాళీ అయిపోయింది.. ఇప్పుడు ఇంట్లో ఆటలు ఆడేవారు ఇకలేరు. నా పిల్లలకు బదులు దేవుడు నన్ను తీసుకెళ్లి పోయినా బాగుండేది’ అని ఏడవసాగింది.
శనివారం ఉదయం , ఎస్‌ఆర్‌జి ఆసుపత్రి మార్చురీ వద్ద పిల్లల తల్లిదండ్రుల రోదనలు గుండెలు పగిలేలా చేశాయి. ఐదుగురు పిల్లల మృతదేహాలు ఒకే చితిపై దహనం చేయగా.. మరో ఇద్దరు పిల్లలను వేర్వేరుగా దహనం చేశారు. ఈ సంఘటన తర్వాత, స్కూల్ సిబ్బందిలో ఐదుగురిని సస్పెండ్ చేసి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అజయ్ సింగ్ బాధిత కుటుంబాలను పరామర్శించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కూల్ భవనం రిపేరు కోసం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పాఠశాల శిథిలావస్థ స్థితి గురించి ఎటువంటి సమాచారం అందకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరణించిన పిల్లల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.
గ్రామ ప్రజలు గురాడీ సర్కిల్, ఎస్‌ఆర్‌జి ఆసుపత్రి వద్ద రోడ్లు బ్లాక్ చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు నరేష్ మీనా నిరసనలో పాల్గొనగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లోని గ్రామీణ పాఠశాలల సౌకర్యాల పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. ఇప్పటికైనా శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను రిపేర్ చేయించాలని లేదా.. వాటిని కూలగొట్టి కొత్త భవనాలను నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Railway Notification: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజుల సమయమే.. డోంట్ మిస్
ALSO READ: ESIC Recruitment: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. 2లక్షల వేతనం, పూర్తి వివరాలివే..