Yogi Adityanath Muslim Remarks| ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పదంగా మాట్లాడారు. రాష్ట్రంలో హిందువులు బాగుంటేనే.. ముస్లింలు బాగుంటారని చెప్పారు. తాను ఒక యోగినని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేదే తన లక్ష్యం అని, అందుకే రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు. ఒక ఇంటర్‌వ్యూలో.. బీజేపీ ప్రభుత్వం హిందూ మతానికే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలను సూచిస్తూ మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగానే సిఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఉత్తర ప్రదేశ్‌లో ఒకప్పుడు హిందువుల దుకాణాలు కాలిపోతే, ముస్లింల దుకాణాలు కూడా వెంటనే అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లు కాలిపోతే, ఆ వెంటనే ముస్లింల ఇళ్లు కూడా కాలిపోయేవి. కానీ ఇదంతా 2017కి ముందు పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మారిపోయింది. ఇప్పుడు వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. కానీ వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకి రక్షణ లేదు. ఉదాహరణకు ఒక బంగ్లాదేశ్ చూడండి. ఒక పాకిస్తాన్ ని చూడండి. అఫ్ఘనిస్తాన్ లో కూడా ఏం జరుగుతోందో మీకు తెలుసు కదా! ఇతరులు దాడి చేయకముందే జాగ్రత్త పడటంలో తప్పేముంది?” అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
“హిందువులు బాగున్నారంటే, ముస్లింలు కూడా బాగున్నారన్న మాట. నేను ఒక సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరుడిని, ఒక యోగిని. నా దృష్టిలో అందరూ సమానమే. ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలనేదే నా కోరిక. ఇదే రాష్ట్ర అభివృద్ధికి కీలకం” అని ఆయన తన దృష్టికోణాన్ని వివరించారు.
సనాతన ధర్మం ఈ భూమిపై అత్యంత పురాతన మతం అని, హిందువులు ఇతరుల విశ్వాసాలను ఎప్పుడూ దెబ్బతీయలేదని ఆయన పేర్కొన్నారు. హిందూ పాలకులు ఇతర దేశాలను ఆక్రమించుకున్న దాఖలాలు చరిత్రలో లేవని, కానీ ఇప్పుడు హిందువులకు ఏమి దక్కుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కాదు.. హై కోర్టు అలా వ్యాఖ్యానించడం బాధాకరం
“రాహుల్ గాంధీలాంటి ‘నమూనాలు’ ఉన్నంత కాలం బీజేపీ బలంగా ఉంటుంది. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగి, విదేశాల్లోకి వెళ్లి తమ దేశాన్నే దూషించారు. ప్రజలు వారి ఉద్దేశాలను అర్థం చేసుకున్నారు. ఇలాంటి ‘నమూనాలు’ బీజేపీకి ఇంకా అవసరం. అప్పుడే మనం ముందుకు సాగగలం. అయోధ్య, కుంభమేళా వంటి సందర్భాలను కూడా కాంగ్రెస్ వివాదాలతో నింపుతుంది” అని యోగి విమర్శించారు.
న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాము, లేకుంటే..
ప్రార్థనా స్థలాల వివాదాలపై యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. “న్యాయ వ్యవస్థపై మాకు గొప్ప గౌరవం ఉంది. కోర్టు నిర్ణయాలను మేము పాటిస్తున్నాము. లేకుంటే ఇప్పటికే ఏమై ఉండేదో ఎవరికి తెలుసు?” అని ప్రశ్నార్థకంగా పేర్కొన్నారు.
భారతీయ వారసత్వానికి ఆలయాలే ప్రతీకలు అని యోగి పేర్కొన్నారు. “అలాంటి ఆలయాలను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. దేవుడు ఇచ్చిన కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని చూడాలి. శంభల్‌లో ఏం జరిగిందో అదే సత్యం” అని ఆయన పేర్కొన్నారు.
“ఆలయాలను కూల్చి మసీదులు కట్టడం ఇస్లాం ధర్మంలోనే అనుమతించబడలేదు. అయినా వారు అలా చేశారు. ప్రస్తుతం మేము శాస్త్రీయ ఆధారాలతో పని చేస్తున్నాము. ఒక్కొక్క సత్యాన్ని బయటకు తీసుకువస్తాము” అని యోగి తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.