Mineral Water: స్వేచ్ఛ బ్యూరో: ఎండలు మండుతున్నాయి.. గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి.. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లాలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో కొందరు నీళ్ల దందాకు తెర లేపుతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా శుద్ధ జల ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినరల్ వాటర్ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అందినకాడికి దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మినరల్ వాటర్ పేరుతో కొంతమంది వ్యాపారులు మామూలు నీటిని సరఫరా చేసి అక్రమ డబ్బు సంపాదనకు తెరలేపారు. వేసవి కాలంలో మి నరల్ వాటర్ (బోరు నీరు) ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బోరు నీటికి కొన్ని రసాయనాలు కలిపి మినరల్ వాటర్ పేరుతో అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునే వారులేరు. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా చాలా మంది మినరల్ వాటర్ పేరుతో నీటిని విక్రయిస్తున్నారు. మిషన్ భగీరథ నీటి కన్నా ఇవి శ్రేష్టమైనవి అనే కారణంతో ప్రజలు మినరల్ వాటర్ వైపు మొగ్గు చూపుతున్నారు.అయినా అధికారులు వీటిపై ధృష్టి సారించకపోవడంపై అనుమానా లకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లలో అనేక వాటికి అనుమతులు లేవని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా, వాటిలో 90శాతం మేర ఎక్కడా కూడా నిబంధనలు పాటించడం లేదు.
ఆదునిక యంత్రాల సహాయంతో నీటిని మూడు దశల్లో మినరల్ వాటర్‌గా తయారు చేయాల్సి ఉం టుంది. ముందుగా నీటిని క్లోరినేషన్ చేస్తారు. ఆ నీటిని ప్రత్యేకమైన శాండ్ ఫిల్టర్ ద్వారా వడబోసి కా ర్బన్, మైక్రాన్ ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేయాల్సి ఉంటుంది. తరువాత మరో కంపార్ట్‌మెంట్‌లోకి నీటిని పంపి ఓజోనైజేషన్ ప్రక్రియ ద్వారా ఎటువంటి సూక్ష్మ క్రిములు లేకుండా మార్చాల్సి ఉంటుంది. చివరి దశలో ఆక్సీజన్ పంపడం ద్వారా ఆక్సీకరణ జరిపి రంగు, రుచి, వాసన లేకుండా శుద్ధి చే యాలి. అనంతరం ప్రతి లీటర్ నీటిలో 75 ఎం.ఎల్ కాల్షియం, 35 ఎంజీ మెగ్నీషియం, 0.3 ఎంజీ ఐరన్ ఉండేలా చూడాలి. క్లోరైడ్ ఒక మిల్లీ గ్రామ్ మించకుండా జాగ్రత్తలు వహించాలి. ఇలా తయారు చేసిన నీరు వారం రోజుల లోపు వినియోగించాలి. ప్రతి ఆర్ వో ప్లాంట్‌లో ఆహార కల్తీ తనిఖీ భారత ప్రమాణ సంస్థ (ఐఎస్‌ఐ)లోని 145, 43 సెక్షన్‌ల కింద రిజిస్టర్ కావాలి. అయితే జిల్లాలో ఈ నిబంధనలన్నీ కాగితా లకే పరిమితం కావడం గమనార్హం. పెళ్లిళ్లు, ఇతర కార్యాలలో వాటర్ క్యాన్‌ల వినియోగం పెరిగిపోవ డంతో వ్యాపారులు బోరు నీటిని వ్యాన్లలో నింపి అందులో కొన్ని రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి.
Also read: నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!
అక్రమ నీటి వ్యాపారం సంబంధిత అధికారులకు తెలిసినా తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని ప్లాంట్లు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. జిల్లాలో 430 పై చిలుకు మినరల్ వాటర్ ప్లాంట్లు, ఆర్‌వో ప్లాంట్ల పేరుతో నీటి విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న గదిలో నిర్వాహకులు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ. ఆయా ప్లాంట్లలో తయారు చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌కు రూ. 20, కూల్ వాటర్ అయితే రూ. 40 చొప్పున అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఐఎస్ ఐ స్టాండర్డ్స్ పాటించాలి. కానీ అలా పాటించాలంటే సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే చాలా మంది అంతంత పెట్టుబడి పెట్టలేక తక్కువ ఖర్చుతో నిబంధనలకు విరుద్ధంగా మినరల్ వాటర్, ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం చేస్తున్నారు.
అనారోగ్యాలకు ప్రధాన కారణం తాగునీరేనని వైద్యులు సూచిస్తున్నారు. కాచి, వడబోసి తాగమని సలహా ఇస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా మి నరల్ వాటర్ పేరుతో సాధారణ జలాన్ని ప్రజలకు అందిస్తున్నారు. కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా చేరడం మూలంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మినరల్ వాటర్ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో ఫంగస్ చేరి ప్రజలు రోగాల బారిన పడు తున్నారు. పూర్తిగా శుభ్రం చేయని నీటిలో ఈకొళి బ్యాక్టీరియా, కోళీఫార్మా ఎక్కువగా ఉండటం అనారోగ్యానికి కారణం అవుతుంది. వీటివల్ల టైఫాయిడ్, కామెర్లు, అతిసారం, కడుపుమంట, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చె బుతున్నారు. ప్లాంట్లలో పరిశుభ్రత లేకపోవడం, స్టీల్ ట్యాంక్స్, రోజువారీగా వాడే క్యాన్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయక ఫంగస్ ఫామ్ కావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని,ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అనుమతులు లేకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకొని శుద్ధమైనన నీటిని సరఫరా చేసేలా పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు.