E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారా?.. డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ రిపోర్ట్..!

ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారా?.. డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ రిపోర్ట్..!
Advertisement

Gaming Addiction: స్వేచ్ఛ బ్యూరో: ఓ రెండు దశాబ్ధాల క్రితం వరకు పిల్లల ఆటలంటే క్రికెట్​, కబడ్డీ, కోకో, బొంగరాలు, గిల్లీదండా, గోలీలు. సాయంత్రం స్కూల్​ నుంచి రాగానే బ్యాగ్​ ఇంట్లో పెట్టేసి అమ్మ పెట్టిన ఇంత అన్నమో.. టిఫినో తిని పిల్లలు వీధుల్లోకి పరుగెత్తేవారు. లేకపోతే దగ్గర్లో ఉన్న గ్రౌండ్లకు చేరుకుని చీకటి పడేవరకు ఆడుకుని ఇంటికి చేరుకునేవారు. అయితే, ప్రస్తుతం ఇది గతంలా మిగిలిపోయింది. ఇప్పటి పిల్లలకు ఆటలంటే కంప్యూటర్​.. స్మార్ట్​ ఫోన్ లోని ఆన్​ లైన్​ గేమ్స్​ మాత్రమే. కంప్యూటర్​, మొవైల్​ ఫోన్ల స్క్రీన్లకు అతుక్కుపోతున్న పిల్లలు గంటలపాటు అదే ప్రపంచంగా కాలం గడుపుతున్నారు. తద్వారా శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. పరిస్థితి ఎంతగా దిగజారుతోందంటే సెల్ ఫోన్​ చూడొద్దని తల్లిదండ్రులు మందలిస్తే కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు యుక్త వయస్కులు కూడా ఉండటం ఆందోళనాకరం. ఇక, మరికొందరు పిల్లలు ఇండ్లు వదిలేసి వెళ్లిపోతున్నారు.

స్మార్ట్​ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక..

మొబైల్​ ఫోన్​ వచ్చినపుడు ఓ సంచలనం. ఎక్కడ ఉన్నా ఎవ్వరితోనైనా మాట్లాడే అవకాశం మొబైల్​ ఫోన్​ కల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా కాలక్రమేణా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్​ ఫోన్లు ముఖ్యంగా పిల్లలపై కనబరుస్తున్న దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. మెడ, భుజాల నొప్పులు, కంటికి సంబంధించిన సమస్యలతో లక్షల సంఖ్యలో పిల్లలు బాధపడుతున్నారు. ఈ పరిస్థితికి చాలావరకు కారణం పెద్దలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు మూడేళ్ల వయసు కూడా నిండక ముందే గమ్మున ఉంటారన్న ఉద్దేశ్యంతో పెద్దలే పిల్లల చేతికి మొబైల్​ ఫోన్లు ఇస్తున్నారు. ఆన్​ లైన్​ గేమ్​ లు ఆడిపిస్తున్నారు. కార్టూన్లు చూపిస్తున్నారు. సహజంగానే ఆకట్టుకునే రీతిలో ఉండే ఈ ఆన్​ లైన్​ గేమ్ లు..కార్టూన్​లకు పిల్లలు బానిసలుగా మారుతున్నారు. దీంతో మానసిక, శారీరక రుగ్మతల బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే ఈ పరిణామాలను గుర్తించి ‘గేమింగ్ డిజార్డర్’ పిల్లల పాలిట యమ డేంజర్​ అని ప్రకటించింది.

ఈ గేమ్స్​ తో..

Advertisement

ఇది ఒక ఎత్తయితే ఫ్రీ ఫైర్​, ఫ్రీ ఫైర్​ మ్యాక్స్​ వంటి ఆన్​ లైన్​ మల్టీప్లేయర్​ గేములు చిన్నపిల్లల పాలిట మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్లలో చదువుతున్న పదేళ్ల పిల్లల నుంచి పదిహేడేళ్ల విద్యార్థుల వరకు క్లాస్​ రూంల కంటే ఎక్కువగా ఫ్రీ ఫైర్​, ఫ్రీ ఫైర్​ మాక్స్​ వంటి గేమింగ్​ వర్చువల్ యుద్ద భూమిలోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు. స్నేహితుల మధ్య స్టేటస్​ ను కోల్పోకూడదన్న తాపత్రయమే దీనికి కారణమన్నది సుస్పష్టం. ఆటలో రేర్​ ఐటమ్స్​, రకరకాల ఆయుధాలు, ఎలైట్ పాస్​ ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూస్తుండటం..ఇవి లేనివారిని తక్కువ చేసి మాట్లాడుతుండటంతో పిల్లలు వాటి కోసం గంటల తరబడి మొబైల్​ ఫోన్లలోనే తలదూర్చి పెడుతున్నారు.

Also read: లాక‌ప్‌డెత్ మ‌చ్చ‌.. అమ‌రావ‌తి భూముల ర‌చ్చ‌! చంద్ర‌బాబును వెంటాడుతున్న వైఎస్సార్ సీపీ!

పెద్దల అకౌంట్లకు చిల్లు..

Advertisement

ఫ్రీ ఫైర్​, ఫ్రీ ఫైర్​ మ్యాక్స్​ వంటి ఆన్​ లైన్​ మల్టీ ప్లేయర్​ గేమ్​ లలో వర్చువల్​ కాయిన్స్​, డైమండ్స్ కొనటానికి ఫోన్​ లలో సేవ్​ చేసి ఉన్న కార్డ్స్​, యూపీఐలను పిల్లలు వాడేస్తున్నారు. ముఖ్యంగా తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్​ లాగిన్​ అయి ఉంటుండటంతో వేల రూపాయల లావాదేవీలు చేసేస్తున్నారు. అకౌంట్​ నుంచి డబ్బు ట్రాన్స్​ ఫర్​ అయిన తరువాతగానీ పెద్దలకు ఈ విషయం తెలియటం లేదు. అయితే, పిల్లలు చేసిన పని తెలియక చాలామంది తమ ఫోన్లు హ్యాక్​ అయ్యాయంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలిగా ఈ తరహా ఫిర్యాదులు సైబర్​ క్రైం పోలీసులకు తరచూ అందుతున్నాయి. దర్యాప్తు జరిపిన తరువాత అసలు విషయం బయట పడుతోంది.

అపరిచితులతో పరిచయాలు..

ఇటీవల పాతబస్తీ ఫలక్​ నుమా పోలీస్​ స్టేషన్​ పరిధిలో అక్కాచెల్లెళ్లు తమ అన్న కూతురితో సహా ఇల్లు వదిలేసి ఏలూరుకు పారిపోయిన విషయం తెలిసిందే. కారణం..సెల్​ ఫోన్​ ను ఎక్కువగా వాడొద్దని తల్లి మందలించటమే. ముగ్గురిని సురక్షితంగా కాపాడిన పోలీసులు వారిని తిరిగి తీసుకు వచ్చి విచారణ జరిపినపుడు దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూశాయి. ఫ్రీ ఫైర్​ గేమ్​ ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న ఈ ముగ్గురు బాలికలు ఆ తరువాత సోషల్​ మీడియా యాప్స్​ ద్వారా వారితో చాటింగ్ కొనసాగిస్తూ వచ్చారు. తల్లి మందలించగానే కోపంతో ఇలా పరిచయమైన వారిని కలిసేందుకు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు. నిజానికి భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ఫైర్​ గేమ్​ ను 2022లోనే నిషేధించింది. అయినా, ఇప్పటికీ వీపీఎన్​ ల ద్వారా ఈ గేమ్​ అందుబాటులో ఉండటం గమనార్హం. ఫ్రీ ఫైర్​ కు అప్​ గ్రేడెడ్​ వర్షన్​ గా వచ్చిన ఫ్రీ ఫైర్ మ్యాక్స్​ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్లలో అందుబాటులో ఉంది.

Also Read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

తల్లిదండ్రులదే బాధ్యత..

ఆన్​ లైన్​ గేమ్​ ల ఉచ్చులో పిల్లలు చిక్కుకోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ చెప్పారు. పిల్లల స్క్రీనింగ్​ టైంపై ఖచ్చితంగా ఆంక్షలు విధించాలన్నారు. రోజులో గంటకన్నా ఎక్కువ సమయం పిల్లల చేతికి మొబైల్​ ఫోన్లు ఇవ్వొద్దని సూచించారు. ఆన్​ లైన్ గేమ్​ ల ఉచ్ఛు నుంచి పిల్లలను బయటకు తీసుకు రావటానికి చెస్​, క్యారమ్స్​ వంటి ఆటలకు వారిని అలవాటు చేయాలన్నారు. అందుబాటులో ఉంటే దగ్గరలోనే ప్లే గ్రౌండ్స్​ కు తీసుకెళ్లి ఔట్ డోర్​ గేమ్స్ ఆడించాలని చెప్పారు. ఇక, పిల్లల చేతికి ఇచ్చే ఫోన్ల నుంచి సేవ్​ చేసి పెట్టిన బ్యాంక్​ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తప్పనిసరిగా తొలగించాలని చెప్పారు.

వైద్యుల వద్ద కౌన్సిలింగ్..

ప్రతీ లావాదేవీకి పిన్, బయోమెట్రిక్​ లాక్​ ను తప్పనిసరి చేయాలన్నారు. పిల్లల్లో హద్దులు దాటిన కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గటం , ఫోన్ ను దొంగచాటుగా వాడటం వంటి మార్పులు కనిపిస్తే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలన్నారు. పిల్లలకు రోజులో కనీసం ఓ రెండు గంటల సమయం కేటాయించి వారితో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గేమింగ్ యాప్‌ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీటి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకునేలా గూగుల్ వంటి సంస్థలకు లేఖలు రాస్తామని చెప్పారు.

Also read: ఏపీలో మెగా డ్రోన్ నెట్‌వర్క్.. కిలోమీటరుకు 10 పైసలే.. ఇక గాల్లోనే సరుకు రవాణా!

Related News

గద్వాల్ జిల్లాలో దారుణం.. ప్రారంభానికి ముందే బీటలు వారిన కొత్త హాస్పిటల్..!

ఏపీ తరహా ఇబ్బందులు వద్దే వద్దు.. ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు!

ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

Vegetable Prices: కూరగాయల ధరల దెబ్బకు.. సామాన్యుడి గుండె గుభేల్..!

సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లలో వింత పరిస్థితి.. ఎంత చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం..!

తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?

ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?

Big Stories

×